Sunday 20 November 2016

మెగా కబురు.. ‘ధృవ’ రిలీజ్ డేట్ కన్ఫమ్

మెగా అభిమానుల నిరీక్షణ ఫలించబోతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ‘ధృవ’ సినిమా కోసం ఇంకెంతో కాలం మెగా ఫ్యాన్స్ నిరీక్షించాల్సినపని లేదు. ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. డిసెంబరు 2 నుంచి ‘ధృవ’ను వాయిదా వేసిన నిర్మాత అల్లు అరవింద్ ఆ తర్వాతి వారానికే సినిమాను కన్ఫమ్ చేశాడు. డిసెంబరు 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సౌత్ ఇండియాలో రాబోతున్న స్టార్ సినిమా ఇదే. ఈ నిర్ణయం వచ్చాక తొలి వారంలో విడుదలైన సినిమాలకు పంచ్ బాగానే పడింది. ఇటు తెలుగులో.. అటు తమిళంలో వచ్చిన సినిమాలన్నీ దెబ్బ తిన్నాయి. చాలా సినిమాలు వాయిదా కూడా పడ్డాయి.

మళ్లీ మామూలు పరిస్థితులు రావడానికి ఎంత సమయం పడుతుందో అన్న ఆందోళనతో ‘ధృవ’ను జనవరికి వాయిదా వేసేస్తున్నట్లు జరిగిన ప్రచారం మెగా అభిమానుల్లో కలకలం రేపింది. ఐతే డిసెంబర్లోనే రిలీజ్ అని నొక్కి వక్కాణించిన అరవింద్.. ఇప్పుడు 9న సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించాడు. నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతుండటం.. ఈ వీకెండ్లో వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కలెక్షన్లు బాగుండటంతో ‘ధృవ’ ధైర్యం చేసి 9నే వచ్చేస్తున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’కు రీమేక్ గా తెరకెక్కిన ‘ధృవ’కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే మార్కెట్ లోకి నేరుగా విడుదలైన ‘ధృవ’ పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. చరణ్ సరసన రకుల్ ప్రీత్ కథానాయికగా నటించిందీ సినిమాలో.

No comments:

Post a Comment